Team India: టీమిండియా బ్యాటింగ్ కోచ్ రేసులో విక్రమ్ రాథోడ్, సంజయ్ బంగర్, మార్క్ రాంప్రకాశ్
- ఇటీవలే ముగిసిన టీమిండియా సహాయక సిబ్బంది కాలపరిమితి
- కొత్త నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేసిన బీసీసీఐ
- భారీ సంఖ్యలో దరఖాస్తులు
ఇటీవలే టీమిండియా కోచ్ గా రవిశాస్త్రి పునర్నియామకం జరిగిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ తో టీమిండియా కోచింగ్ సిబ్బంది కాలపరిమితి ముగిసింది. కోచ్ ఎంపిక ప్రక్రియ ముగియడంతో, ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ సహాయక సిబ్బంది ఎంపిక ప్రక్రియ షురూ చేసింది. ఒక్కో పదవికి ముగ్గురు అభ్యర్థుల చొప్పున జాబితాలను కుదించింది.
బ్యాటింగ్ కోచ్ పదవికి 14 మంది దరఖాస్తు చేసుకోగా, వారిని వడపోసి ముగ్గుర్ని ఎంపిక చేశారు. వారిలో విక్రమ్ రాథోడ్ మొదటి స్థానంలో ఉండగా, సంజయ్ బంగర్, మార్క్ రాంప్రకాశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. సంజయ్ బంగర్ ఇప్పటివరకు టీమిండియాకు బ్యాటింగ్ కోచ్ గా పనిచేశాడు.
ఇక బౌలింగ్ కోచ్ విషయానికొస్తే తాజా మాజీ భరత్ అరుణ్ కే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తర్వాత పరాస్ మాంబ్రే, వెంకటేశ్ ప్రసాద్ ఉన్నారు. ఫీల్డింగ్ కోచ్ రేసులో వరుసగా ఆర్ శ్రీధర్, అభయ్ శర్మ, టి దిలీప్ లతో జాబితాను కుదించారు. ఫిజియోథెరపిస్ట్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ పోస్టులకు కూడా అభ్యర్థులను కుదించారు. వీరికి మరో రౌండ్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఆపై తుది జాబితా ప్రకటించనున్నారు.