Chandrayaan-2: చంద్రయాన్ కు చిక్కిన చందమామ ఇదే!
- తొలి అద్భుతాన్ని ఆవిష్కరించిన చంద్రయాన్
- 2,650 కి.మీ. ఎత్తు నుంచి ఫోటో
- విడుదల చేసిన ఇస్రో
చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన తరువాత చంద్రయాన్-2 తొలి అద్భుతాన్ని ఆవిష్కరించింది. చంద్రుడిని తన కెమెరాలో బంధించిన చిత్రాన్ని భూమిపైకి పంపింది. ఎల్-14 కెమెరాతో రాత్రి సమయంలో చంద్రయాన్-2 ల్యాండర్ చిత్రీకరించిన ఫోటోను ఇస్రో విడుదల చేసింది. చంద్రుడి కక్ష్యలో తిరుగుతూ 2,650 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఈ ఫోటోను చంద్రయాన్ తీసింది.
కాగా, భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 మిషన్ లోని ల్యాండర్, రోవర్ సెప్టెంబర్ 7న తెల్లవారు జామున 1.40 నిమిషాలకు చంద్రుడిపై ల్యాండ్ కానున్నాయి. ఈ మొత్తం ప్రక్రియ 15 నిమిషాల్లో పూర్తి కానుందని అధికారులు వెల్లడించారు. ఇక ఈ ఫోటోను ట్వీట్ చేసిన ఇస్రో, చంద్రుడి దక్షిణార్ధగోళంలో ఉన్న అపోలో క్రేటర్స్ బిలం, పశ్చిమ అంచులో ఉన్న మేర్ ఓరియంటేల్ అనే మరొక పెద్ద బిలాన్ని చిత్రంలో చూడవచ్చని పేర్కొంది.