Tamil Nadu: అక్కడ ఎలుక మాంసానికి భలే గిరాకీ... కుంభకోణంలో నయా ఉపాధి మార్గం
- ఆరు ఎలుకలు రూ.200 మాత్రమే
- కోళ్లలా వేలాడదీసి అమ్మకం
- కరవు నేపథ్యంలో కొందరికి ప్రత్యామ్నాయ మార్గం
తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణంలో ఇప్పుడో కొత్త వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం కరవుతో అల్లాడిపోతున్న ఈ ప్రాంతంలో కొందరికి ఈ వ్యాపారం సరికొత్త ఉపాధి మార్గంగా మారింది. ఏకంగా ఎలుకలను కోళ్లలా వేలాడదీసి మరీ అమ్ముతున్నారు. కొనుగోళ్లు కూడా జోరుగా సాగుతుండడం విశేషం.
వివరాల్లోకి వెళితే...తంజావూరు జిల్లాను ఈ ఏడాది కరవు కమ్మేసింది. చినుకమ్మ జాడలేకపోవడంతో పంటపొలాలన్నీ బీళ్లుగా పడివున్నాయి. బీడువారిన భూముల్లో ఎలుకల సంచారం కూడా అధికంగా ఉంది. దీంతో కొంత మందికి ఈ ఎలుకలే జీవనాధారంగా మారాయి. వాటిని పట్టుకుని మాంసాన్ని అమ్మి ఉపాధి పొందుతున్నారు.
కుంభకోణం వద్ద ఉన్న నీలత్తనల్లూర్, ఆవూర్ ప్రాంతాల్లో ఎలుక మాంసాన్ని జోరుగా విక్రయిస్తున్నారు. ఆరు ఎలుకల ఖరీదు రూ.200లు మాత్రమే. పంట పొలాల్లో లభించే ఎలుక మాంసం అత్యంత రుచిగా ఉంటుందని, దీనిలో ఔషధ గుణాలు అధికంగా వుంటాయన్న ప్రచారంతో జనం కూడా ఎగబడి మరీ కొంటున్నారు. స్థానికులే కాదు, ఇతర ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్నారు.