Vijayanagaram: విద్యార్థులు ఏం తప్పుచేశారని లాఠీలతో కొట్టించారు? వీళ్లేమీ లక్షల కోట్లు దోచుకున్న దొంగలు కాదే!: చంద్రబాబు
- నిన్న విజయనగరం కలెక్టరేట్ ముట్టడి ఘటనపై స్పందన
- ఫీజులు ఇవ్వమని అడగడం తప్పా?
- విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
ఫీజ్ రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఉపకారవేతనాలు చెల్లించాలని, సంక్షేమ గిరిజన హాస్టల్లో వసతులు మెరుగుపరచాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ విజయనగరం కలెక్టరేట్ ను నిన్న ముట్టడించిన విషయం తెలిసిందే. అక్కడి విద్యార్థులను చెదరగొట్టే క్రమంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలు తలెత్తాయి. ఈ ఘటనపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు మండిపడ్డారు.
చదువుకుంటాం ఫీజులు ఇవ్వండి, ఉపకారవేతనాలు ఇవ్వండి అని విద్యార్థులు అడగడం తప్పా? విద్యార్థులు ఏం తప్పుచేశారని వాళ్లని లాఠీలతో కొట్టించారు? వీళ్లేమీ లక్షల కోట్లు దోచుకున్న దొంగలు కాదే! అని అన్నారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై జులుం ప్రదర్శించాల్సిన అవసరం ఏమొచ్చింది? వారి సమస్యలను పరిష్కరిస్తామన్న భరోసాను ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయింది? విద్యార్థులంటే అంత చులకనా? వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది' అని అన్నారు.