Deccan Chronicle: డెక్కన్ క్రానికల్ కథనంపై నారా లోకేశ్ వ్యాఖ్యలు
- టీడీపీ కార్యకర్తలే లోకేశ్ ను ట్రోల్ చేస్తున్నారంటూ డెక్కన్ క్రానికల్ కథనం
- వెంటనే స్పందించిన లోకేశ్
- తన దృష్టిలో ద్వేషం కంటే ప్రేమను పంచడమే మంచిదని లోకేశ్ ట్వీట్
ఏపీ రాజకీయాల్లో ఇటీవల ప్రభాస్ పేరు కూడా వినిపిస్తోంది. ఏపీ సీఎం జగన్ పై ప్రభాస్ సానుకూల వ్యాఖ్యలు చేసినట్టు కథనాలు రావడమే అందుకు కారణం. ఈ క్రమంలో ప్రభాస్ నటించిన 'సాహో' చిత్రానికి వ్యతిరేకంగా టీడీపీ ప్రచారం చేస్తోందని మరికొన్ని కథనాలు పుట్టుకొచ్చాయి. దాంతో రంగంలోకి దిగిన నారా లోకేశ్ 'సాహో' చిత్రానికి, ప్రభాస్ కు తాము వ్యతిరేకం కాదని, 'సాహో' చిత్రాన్ని టీడీపీ కార్యకర్తలు కూడా చూసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇదిలావుంటే, డెక్కన్ క్రానికల్ పత్రిక అనూహ్యరీతిలో ఓ కథనాన్ని వెలువరించింది.
'సాహో' చిత్రానికి మద్దతుగా మాట్లాడుతున్నందుకు నారా లోకేశ్ ను సొంత పార్టీ టీడీపీ వాళ్లే ట్రోల్ చేస్తున్నారన్నది ఆ కథనం సారాంశం. దీనిపై లోకేశ్ వెంటనే బదులిచ్చారు. "ప్రియమైన డెక్కన్ క్రానికల్, ఈ లోకంలో ఎవరూ శాశ్వతం కాదు. అలాంటప్పుడు ద్వేషం కంటే ప్రేమను పంచడం మంచిది కాదా? అసూయపడడం కంటే దయ చూపడం మంచిది కాదా? 'సాహో' విషయంలో నేను కామెంట్ చేసింది ఆ ఉద్దేశంతోనే. ఇప్పుడు మీరు కూడా నా వాదనను అంగీకరిస్తారని భావిస్తున్నా" అంటూ ట్వీట్ చేశారు.