Kodela: తన నివాసంలో కంప్యూటర్ల చోరీపై స్పందించిన కోడెల
- విద్యుత్ మరమ్మతుల పేరుతో కోడెల ఇంట్లో ప్రవేశించిన ఆగంతుకులు
- కంప్యూటర్లతో పరార్
- ఇది వైసీపీ దుర్మార్గమేనంటూ కోడెల ఆగ్రహం
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ అగ్రనేత కోడెల శివప్రసాదరావు సత్తెనపల్లి నివాసంలో కంప్యూటర్లు చోరీకి గురైన సంగతి తెలిసిందే. విద్యుత్ మరమ్మతులు చేయాలంటూ ఇంట్లోకి ప్రవేశించి కంప్యూటర్లు ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. దీనిపై కోడెల స్పందించారు. తన నివాసం నుంచి కంప్యూటర్లు ఎత్తుకెళ్లింది గుంటూరు వైసీపీ కార్యాలయంలో పనిచేసే అర్జున్ అని, దీనిపై డీఎస్పీకి కూడా సమాచారం అందించానని వెల్లడించారు. అర్జున్ గతంలో తమవద్ద పనిచేశాడని, ఇప్పుడు అంబటి రాంబాబు వద్ద ఉన్నాడని తెలిపారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే అంబటి దీనిపై ఏమంటారని కోడెల నిలదీశారు.
అతడు తన ఇంటి నుంచి కంప్యూటర్లు ఎందుకు తీసుకెళ్లాడు? అతడిని కంప్యూటర్లు తీసుకురమ్మని చెప్పింది ఎవరు? అనే ప్రశ్నలకు జవాబులు తెలియాల్సి ఉందని కోడెల అన్నారు. ఏపీ అధికార పార్టీ తనపై కక్ష కట్టిందని, అందుకే ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతోందని ఆరోపించారు.