Botsa Satyanarayana: రాజధాని అమరావతిపై నా వ్యాఖ్యలను వక్రీకరించారు: బొత్స
- అమరావతిపై బొత్స వ్యాఖ్యల పట్ల తీవ్ర దుమారం
- రాజధాని తరలిస్తున్నారంటూ కథనాలు
- వివరణ ఇచ్చిన బొత్స
రాజధాని అమరావతి నిర్మాణం పెనుభారం అవుతుందంటూ వ్యాఖ్యలు చేసి కలకలం రేపిన ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తన వ్యాఖ్యల పట్ల తాజాగా వివరణ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యల అనంతరం ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నారంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. దాంతో తాము రాజధానిని తరలించబోవడంలేదంటూ వైసీపీ మంత్రులు సర్ది చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో, బొత్స స్వయంగా మాట్లాడారు. రాజధాని అమరావతిపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని వెల్లడించారు.
రాజధాని ఏర్పాటుపై శివరామకృష్ణన్ రిపోర్టును పరిగణనలోకి తీసుకోలేదని మాత్రమే తాను చెప్పానని స్పష్టం చేశారు. రాజధాని విషయంలో తాను మాట్లాడింది వరదల గురించేనని తెలిపారు. పదేళ్ల క్రితం 12 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే అతలాకుతలమైందని, మొన్న 8 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిందని వెల్లడించారు. రాజధాని విషయంలో శివరామకృష్ణన్ రిపోర్టు కాకుండా నారాయణ రిపోర్టు అమలు చేశారని బొత్స ఆరోపించారు.
చంద్రబాబు మాటలు చూస్తుంటే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి మాట్లాడుతున్నట్టే ఉందని విమర్శించారు. అమరావతి చుట్టూ టీడీపీ నేతలకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది కాబట్టే భయపడుతున్నారని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలనే తాము కాంక్షిస్తామని, రాబోయే రోజుల్లో 25 లక్షల కోట్ల సంపద సృష్టించబోతున్నామని చెప్పారు.