Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ వైఖరితో న్యాయపరమైన ఇబ్బందులు తప్పవు: కేంద్రానికి నివేదిక సమర్పించిన పోలవరం అథారిటీ
- పోలవరంపై నివేదిక రూపొందించిన పీపీఏ
- రివర్స్ టెండరింగ్ కు వెళితే ఎదురయ్యే నష్టాలను వివరించిన అథారిటీ
- ప్రాజక్టు నిర్మాణం మరింత ఆలస్యం అవుతుందని వెల్లడి
ఏపీ సర్కారు పోలవరం టెండర్లను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ కు వెళ్లడం పట్ల కేంద్రం నివేదిక కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రాజక్టు స్థితిగతులపై పోలవరం ప్రాజక్టు అథారిటీ (పీపీఏ) 12 పేజీల నివేదిక రూపొందించింది. పోలవరం ప్రాజక్టు విషయంలో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ అమలు చేస్తే ఎలాంటి నష్టాలు ఉంటాయో ఈ నివేదికలో సమగ్రంగా పేర్కొన్నారు. ఈ మేరకు పీపీఏ తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. ముఖ్యంగా, ఏపీ ప్రభుత్వం తీరుతో న్యాయపరమైన సమస్యలు తప్పవని పీపీఏ స్పష్టం చేసింది.
రివర్స్ టెండరింగ్ వల్ల ప్రాజక్టు నిర్మాణం మరింత ఆలస్యమవుతుందని పేర్కొంది. ప్రాజక్టు నిర్మాణంలో ఇప్పటికే నాలుగేళ్లు జాప్యం జరిగిందని తత్ఫలితంగా పట్టిసీమ, పురుషోత్తమపట్నం ప్రాజక్టులు మరింత భారం కానున్నాయని, పోలవరం ద్వారా జరగాల్సిన ప్రయోజనాల విషయంలోనూ మరింత ఆలస్యం తప్పదని వివరించింది.