Andhra Pradesh: ఏపీ, తెలంగాణలో నేడు భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణ శాఖ!
- మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్ గఢ్ లోనూ కుండపోత
- ఉత్తరాది రాష్ట్రాలకు కూడా వరుణగండం
- మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండీ సూచన
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈరోజు భారీవర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్ గఢ్, ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవొచ్చని వెల్లడించింది.
ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, యానాం, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో సైతం వరుణుడు తన ప్రతాపాన్ని చూపే అవకాశముందని పేర్కొంది. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఈరోజు గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. ఈ సందర్భంగా మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ సూచించింది.