Andhra Pradesh: అమరావతిలో సుజనాకు భూములున్నాయన్న విజయసాయిరెడ్డి.. ఘాటుగా స్పందించిన బీజేపీ నేత!
- సాయిరెడ్డి చౌకబారు ట్వీట్లకు స్పందించాల్సి వస్తుందనుకోలేదు
- 1910-2010 కాలంలోనే కొన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి
- దమ్ముంటే భూమి ఉన్నట్లు నిరూపించండి
అమరావతి రాజధాని ప్రాంతంలో చంద్రబాబు, లోకేశ్, కేశినేని, సీఎం రమేశ్, సుజనా చౌదరిల బినామీలకు వేల ఎకరాల భూములు ఉన్నాయని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. రైతులను మోసం చేసి కొన్న ఈ భూముల ధరలు పడిపోతాయన్న భయంతో టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. తాజాగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ నేత సుజనా చౌదరి కౌంటర్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి చేసే చౌకబారు ట్వీట్లకు స్పందించాల్సి వస్తుందని తాను అనుకోలేదని సుజనా చౌదరి తెలిపారు.
1910-2010 మధ్యకాలంలో వంశపారంపర్యంగా, ఇతరత్రా జరిగిన రిజిస్ట్రేషన్లు మినహా తనకు, తన కుటుంబానికి అమరావతిలో కొత్తగా సెంటు భూమి కూడా లేదని స్పష్టం చేశారు. ఒకవేళ భూమి ఉన్నట్లు నిరూపిస్తే అప్పుడు తగిన విధంగా స్పందిస్తానని వ్యాఖ్యానించారు. ఇలాంటి ట్వీట్లతో తన పదవికి ఉన్న గౌరవాన్ని దిగజార్చుకోవద్దని సుజనా హితవు పలికారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.