Anil Kumar: ప్రాజక్టుల నీటి లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయి: మంత్రి అనిల్ కుమార్
- ఈ నెల 9న శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేసినట్టు వెల్లడి
- పులిచింతల నీరు రాకముందే ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటిని వదిలినట్టు వివరణ
- వచ్చిన నీళ్లు వచ్చినట్టే విడుదల చేస్తే రాయలసీమకు నీళ్లు ఎలా ఇవ్వగలమంటూ ఆగ్రహం
గోదావరి, కృష్ణా వరదలు, రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 3 నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల నీటి లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయని ఏపీ నీటి పారుదల, జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ నెల 9న శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశామని వెల్లడించారు. సామర్థ్యం మేర మాత్రమే ప్రాజెక్టుల్లో నీరు నిల్వ చేస్తారని, పులిచింతల నీరు రాకముందే ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటిని దిగువకు విడుదల చేశామని వివరించారు.
నీటి విడుదలపై టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. అబద్ధాలతో ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చిన నీళ్లను వచ్చినట్టే దిగువకు వదిలేస్తే రాయలసీమకు నీళ్లు ఎలా ఇవ్వగలమని ప్రశ్నించారు. శ్రీశైలం నిండాకే పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తరలించే వీలుంటుందని అన్నారు.