Virat Kohli: మా నాన్న మరణించినప్పుడు ఇంటికి వచ్చి పరామర్శించారు: జైట్లీ గొప్పతనం గురించి విరాట్ కోహ్లీ
- జైట్లీ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కోహ్లీ
- జైట్లీ నికార్సయిన వ్యక్తి అంటూ వ్యాఖ్యలు
- ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ ట్వీట్
కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అరుణ్ జైట్లీ గారు పోయారన్న వార్త తెలియగానే ఎంతో విచారం కలిగిందని కోహ్లీ ట్వీట్ చేశాడు. 2006లో తన తండ్రి చనిపోయినప్పుడు జైట్లీ తన ఇంటికి వచ్చి పరామర్శించారని, ఆ సమయంలో ఎంతో బిజీగా ఉన్నా, అన్ని పనులు వాయిదా వేసుకుని తమ నివాసానికి వచ్చి సంతాపం తెలియజేశారని కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. ఎంతో విలువైన సమయాన్ని తమకోసం కేటాయించారని వివరించాడు. ఆయనది ఎంతో మంచి స్వభావం అని, ఇతరులకు సాయపడేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారని కొనియాడాడు. ఈ విషాద సమయంలో ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు కోహ్లీ తన ట్వీట్ లో పేర్కొన్నాడు.