Rahul Gandhi: కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు లేవు... ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది: రాహుల్ గాంధీ
- జమ్మూకశ్మీర్ లో పర్యటించేందుకు వెళ్లిన రాహుల్
- గవర్నర్ ఆహ్వానంపై వచ్చానన్న రాహుల్
- శ్రీనగర్ ఎయిర్ పోర్టులోనే ఆపేసిన అధికారులు
కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కశ్మీర్ లో పర్యటించాలన్న కోరిక తీరకుండానే వెనుదిరగక తప్పలేదు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకశ్మీర్ లో ప్రజల మనోభావాలు తెలుసుకోవాలని, అక్కడి వాస్తవ పరిస్థితులను అంచనా వేయాలని రాహుల్ భావించారు. ఈ నేపథ్యంలో, రాహుల్ తాజాగా జమ్మూకశ్మీర్ లో వివిధ పార్టీల ప్రతినిధులతో కలిసి పర్యటించే ప్రయత్నం చేశారు.
అయితే ఆయనను అధికార వర్గాలు శ్రీనగర్ ఎయిర్ పోర్టులోనే నిలువరించాయి. గంట సేపటి తర్వాత రాహుల్ ను తిరిగి ఢిల్లీ పంపించి వేశారు. దీనిపై రాహుల్ మాట్లాడుతూ, కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు లేవన్న విషయం తనకు ఎదురైన అనుభవంతో స్పష్టమైందని తెలిపారు. తమను కనీసం విమానాశ్రయం దాటి వెళ్లనీయలేదని, చివరికి మీడియా పట్ల కూడా ప్రభుత్వ వైఖరి సవ్యంగా లేదని ఆరోపించారు.
గవర్నర్ ఆహ్వానంపై తాను వచ్చినా ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం విచారకరం అన్నారు. రాహుల్ వెంట ఉన్న గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ మండిపడ్డారు. కశ్మీర్ కు దేశంతో సంబంధాలు తెగిపోయాయని, కార్గిల్ పరిస్థితి కూడా అంతేనని అన్నారు.