Jagaddhatri: భర్త మరణాన్ని భరించలేక తెలుగు రచయిత్రి జగద్ధాత్రి ఆత్మహత్య
- సాహితీ లోకంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జగద్ధాత్రి
- ఇటీవలే ఆమె భర్త రామతీర్థ మృతి
- భర్త మరణంతో మానసికంగా కుంగిపోయిన జగద్ధాత్రి
తెలుగు సాహితీ లోకంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ రచయిత్రి జగద్ధాత్రి విశాఖపట్నంలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవలే ఆమె భర్త రామతీర్థ మృతి చెందారు. భర్త మరణంతో ఆమె తీవ్ర వ్యాకులతకు లోనయ్యారు. రామతీర్థ కూడా సాహితీవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. భర్త మరణంతో మానసికంగా కుంగిపోయిన జగద్ధాత్రి ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. భర్త జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు ఇల్లు కూడా మారారు. అయినా, మానసిక కుంగుబాటు ఆమెను కబళించివేసింది.
కాగా, ఆత్మహత్య సందర్భంగా జగద్ధాత్రి రెండు లేఖలు రాశారు. ఓ దాంట్లో, తన వస్తువులను రాజేశ్ అనే యువకుడికి ఇచ్చేయాల్సిందిగా సూచించారు. మరో లేఖలో, తన చావుకు ఎవరూ కారణం కాదని స్పష్టం చేశారు. జగద్ధాత్రి అనేక కథలతో పాటు, అనువాద కవితలు కూడా రాశారు. వక్షస్థలే అనే కథకు అవార్డు కూడా లభించింది. గతంలో కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యురాలిగానూ వ్యవహరించారు.