Botsa Satyanarayana: మంత్రి బొత్స వ్యాఖ్యలకు నిరసనగా రాజధాని రైతుల ధర్నా
- రాజధానిపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్న బొత్స
- మండిపడుతున్న రాజధాని ప్రాంత రైతులు
- తుళ్లూరు మండలం వెలగపూడి వద్ద రాస్తారోకో
రాజధాని అమరావతిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ పునరుద్ఘాటించడం పట్ల రాజధాని రైతులు మండిపడుతున్నారు. 8 లక్షల క్యూసెక్కుల వరద వస్తేనే అతలాకుతలం అయిందని, 11 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే అమరావతి పరిస్థితి ఏంటని బొత్స వ్యాఖ్యానించారు. రాజధాని ఏ ఒక్కరిదో కాదని, ఐదుకోట్ల మంది ప్రజలదని స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతి నిర్మాణం అత్యంత వ్యయభరితం అంటూ కొన్నిరోజుల క్రితమే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడా వ్యాఖ్యలకే కట్టుబడి ఉన్నానని చెప్పడంతో అందుకు నిరసనగా రాజధాని ప్రాంత రైతులు ధర్నాకు దిగారు.
తుళ్లూరు మండలం వెలగపూడిలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. వాహనాలను నిలిపివేసి రహదారిపై బైఠాయించారు. రాజధాని ముంపు ప్రాంతంలో లేదని, రాజధానిని తరలించే యోచనను విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. అమరావతి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అన్నారు.