Kashmir: మారని కశ్మీర్.. ట్రక్కు డ్రైవర్ ను రాళ్లతో కొట్టి చంపిన దుండగులు

  • సైనిక వాహనం అనుకుని ట్రక్కుపై దాడి చేసిన అల్లరి మూకలు
  • ట్రక్కు డ్రైవర్ తలకు బలమైన గాయం
  • ఆసుపత్రికి తరలించినా దక్కని ఫలితం

కశ్మీర్ లో పోలీసులు, భద్రతాబలగాలపై వేర్పాటువాదుల కిరాయి మూకలు రాళ్లతో దాడి చేయడం పరిపాటే. తాజాగా ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత వారు మరింత ఆగ్రహావేశాలతో ఉన్నారు. తమకు ఇంతకాలం ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ రద్దు కావడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. జమ్మూకశ్మీర్ లో భారీ ఎత్తున భద్రతాబలగాలు మోహరించినప్పటికీ... చెదురుమదురు ఘటనలు అక్కడ చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా, కశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో మరో దారుణం సంభవించింది.

నూర్ మొహమ్మద్ దార్ (42) అనే ట్రక్కు డ్రైవర్ పై దుండగులు దాడి చేశారు. పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఆయనపై కిరాయి మూకలు రాళ్లు రువ్వాయి. ఈ ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనపై జమ్మూకశ్మీర్ పోలీసులు స్పందిస్తూ, అల్లరి మూకలు నూర్ మొహమ్మద్ పై పొరపాటున దాడి చేశాయని తెలిపారు. సైనిక వాహనం అని పొరపడి అతని ట్రక్కుపై దాడి చేశారని చెప్పారు. ఒక రాయి అతని తలపై బలంగా తాకడంతో, అతను తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు. హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించామని... అతను అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారని వెల్లడించారు. బిజ్ బేరా పోలీస్ స్టేషన్ లో హత్య కేసును నమోదు చేశామని తెలిపారు.

  • Loading...

More Telugu News