Kumaraswamy: సిద్ధరామయ్యే నా మొదటి శత్రువు: కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు
- కాంగ్రెస్, జేడీఎస్ మధ్య మాటల యుద్ధం
- ప్రభుత్వ పతనానికి కారణం సిద్ధరామయ్యే
- తాజా ఇంటర్వ్యూలో కుమారస్వామి
తన తొలి శత్రువు సిద్ధరామయ్యేనని, ఆయన కారణంగానే రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పడిపోయిన తరువాత అందుకు కారణం మీరంటే మీరని కాంగ్రెస్, జేడీఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు పార్టీలకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేయగా, 14 నెలల ప్రభుత్వం పడిపోయి, బీజేపీ గద్దెనెక్కిన సంగతి తెలిసిందే.
మొత్తం వ్యవహారంపై దాదాపు నెల రోజుల పాటు మౌనంగా ఉన్న కుమారస్వామి, తాజాగా ఓ న్యూస్ పోర్టల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. సిద్ధరామయ్యపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం పడిపోయిందంటే, అందుకు ఆయనే కారణమన్నారు. తాను ముఖ్యమంత్రిని కావడం ఆది నుంచి ఆయనకు ఇష్టం లేదని, అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసి ఎమ్మెల్యేలను రెచ్చగొట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి వ్యతిరేకంగా సిద్ధరామయ్య పని చేశారన్నారు.
ఇక ఈ ఇంటర్వ్యూను చూసిన సిద్ధరామయ్య సైతం అంతే ఘాటుగా స్పందించారు. పాలన చేతకాకనే కుమారస్వామి, తన ప్రభుత్వాన్ని కూల్చుకున్నారని, ఆయనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు ఇతరులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.