INX case: నేటితో ముగియనున్న చిదంబరం సీబీఐ కస్టడీ...బెయిల్పై ఉత్కంఠ
- ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం అరెస్టు
- అరెస్టుపై సుప్రీంను ఆశ్రయించిన చిద్దూ లాయర్లు
- నేడు విచారించనున్న న్యాయస్థానం
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరానికి బెయిల్పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణంలో అరెస్టయి గడచిన నాలుగు రోజులుగా చిదంబరం సీబీఐ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. కస్టడీ గడువు ఈ రోజు సాయంత్రంతో ముగియనుండడంతో చిదంబరానికి జెయిలా, బెయిలా అన్న అంశంపై చర్చసాగుతోంది. చిదంబరాన్ని అరెస్టు చేసిన వెంటనే ఆయన లాయర్లు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈనెల 23న ఈ పిటిషన్ విచారణకు రాగా కస్టడీ వ్యవహారంపై ఇప్పుడు జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
దీంతో ఈ బెయిల్ పిటిషన్పై సుప్రీం ఈరోజు విచారించనుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులో ఇప్పటికే న్యాయస్థానం అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ ఉత్తర్వులు ఇచ్చినందున సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేస్తే చిదంబరానికి ఊరట లభించినట్టే. లేదంటే జైలుకు వెళ్లాల్సి వస్తుంది.