Donald Trump: ట్రంప్ తో భేటీ అయిన మోదీ.. కశ్మీర్ అంశంపై చర్చ
- ఫ్రాన్స్ లో ట్రంప్ తో భేటీ అయిన మోదీ
- కశ్మీర్ ఉద్రిక్తతను ఎలా తగ్గిస్తారో తెలుసుకోవాలనుకుంటున్న ట్రంప్
- కశ్మీర్ లో ఆంక్షలను ఎత్తివేయాలని కోరే అవకాశం
ఫ్రాన్స్ లో జరుగుతున్న జీ7 దేశాల సదస్సులో కీలక సమావేశం ప్రారంభమైంది. అమెరికా అధ్యక్షుడితో భారత ప్రధాని మోదీ భేటీ అయ్యారు. జీ7 దేశాల్లో కూటమిలో భారత్ లేనప్పటికీ ఫ్రాన్స్ అధినేత ఆహ్వానం మేరకు మోదీ ప్రత్యేక అతిథిగా సదస్సులో పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా అమెరికాకు చెందిన ఓ అత్యున్నత అధికారి మాట్లాడుతూ, జమ్మూకశ్మీర్ వివాదం నేపథ్యంలో పెరిగిన ఉద్రిక్తతలను ఎలా తగ్గిస్తారనే విషయాన్ని మోదీ నుంచి ట్రంప్ తెలుసుకోవాలనుకుంటున్నారని చెప్పారు. కశ్మీర్ లో మానవ హక్కులను ఎలా కాపాడతారనే విషయాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారని తెలిపారు. పాకిస్థాన్ తో చర్చల ద్వారా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని మోదీకి ట్రంప్ సూచించే అవకాశం ఉందని చెప్పారు. కశ్మీర్ లో కమ్యూనికేషన్ వ్యవస్థ, రాకపోకలపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని కోరే అవకాశం ఉందని తెలిపారు.