Amazon: అమెజాన్ అడవుల కోసం 'టైటానిక్' హీరో భారీ విరాళం
- రూ.36 కోట్లు విరాళంగా ప్రకటించిన లియొనార్డో డికాప్రియో
- పర్యావరణ హితం కోసం కృషి చేస్తున్న హాలీవుడ్ స్టార్
- అమెజాన్ అగ్నికి ఆహుతి అవుతుండడం పట్ల ఆందోళన
భూమండలంపై అతిపెద్ద అడవుల సముదాయంగా పేరుగాంచిన అమెజాన్ వర్షారణ్యాలు గత కొన్నిరోజులుగా అగ్నికి ఆహుతి అవుతుండడం పర్యావరణ ప్రేమికులను కలచివేస్తోంది. భూమిపై 20 శాతం ఆక్సిజన్ ఇక్కడినుంచే ఉత్పత్తి అవుతున్న తరుణంలో, ప్రాణాధారం వంటి అమెజాన్ అడవులు కార్చిచ్చు బారినపడి వేలాది ఎకరాల మేర దగ్ధం కావడం అంతర్జాతీయ చర్చనీయాంశంగా మారింది. దీనిపై హాలీవుడ్ నటుడు లియొనార్డో డికాప్రియో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోని ప్రాణికోటికి ఆక్సిజన్ అందించే అమెజాన్ మంటల్లో చిక్కుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు.
డికాప్రియో టైటానిక్ చిత్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన అనేక సంస్థలతో చేయి కలిపి పర్యావరణం కోసం కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, అమెజాన్ దుస్థితి పట్ల చలించిపోయిన డికాప్రియో తనవంతుగా రూ.36 కోట్లు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. తన అభిమానులు కూడా స్పందించి విరాళాలు ఇవ్వాలంటూ పిలుపునిచ్చారు. ఇటీవలే 'ఎర్త్ అలయన్స్' అనే ఛారిటీ సంస్థను స్థాపించిన డికాప్రియో తన సంస్థ తరఫున విరాళం ప్రకటించారు.