USA: చోరీ కోసం వచ్చి కన్నబిడ్డను మర్చిపోయింది... మళ్లీ వచ్చి దొరికిపోయింది!
- అమెరికాలో విచిత్ర సంఘటన
- బిడ్డతో కలిసి చోరీకి వచ్చిన యువతి
- బిడ్డను స్టోర్ లోనే వదిలేసి చిన్నపిల్లల చక్రాల కుర్చీ ఎత్తుకెళ్లిన వైనం
అమెరికాలోని న్యూజెర్సీలో విచిత్రమైన సంఘటన జరిగింది. ఓ డిపార్ట్ మెంటల్ స్టోర్ లో దొంగతనానికి వచ్చిన మహిళ కన్నబిడ్డను అక్కడే మర్చిపోయి వెళ్లిపోయింది. బిడ్డ కోసం మళ్లీ వచ్చి పట్టుబడింది. న్యూజెర్సీలో ఓ యువతి తన ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి చోరీ చేసేందుకు వచ్చింది. ఆమె తన బిడ్డను కూడా వెంట తీసుకువచ్చింది.
ఆ యువతి ఇద్దరు స్నేహితురాళ్లు స్టోర్ సిబ్బందితో మాట కలిపి వారి దృష్టి మరల్చగా, ఇదే అదనుగా భావించి ఆ యువతి చిన్న పిల్లల చక్రాల కుర్చీ ఎత్తుకెళ్లింది. ఈ క్రమంలో ఆమె తన బిడ్డను మాత్రం స్టోర్ లోనే వదిలేసింది. ఆ విషయం జ్ఞప్తికి వచ్చి తిరిగి స్టోర్ వద్దకు రాగా, సిబ్బంది ఆమెను దొరకబుచ్చుకున్నారు. దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించిన సిబ్బంది ఆ యువతిని పోలీసులకు అప్పగించారు.