Chidambaram: సీబీఐ, ఈడీ నా పరువు తీస్తున్నాయి: సుప్రీం కోర్టుకు తెలిపిన చిదంబరం
- సుప్రీం కోర్టులో చిదంబరం బెయిల్ పిటిషన్ పై విచారణ
- పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీం
- తన ఆవేదన వెలిబుచ్చిన కేంద్ర మాజీ మంత్రి
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరంకు సుప్రీం కోర్టులోనూ ఊరట లభించని సంగతి తెలిసిందే. ఆయన బెయిల్ పిటిషన్ సుప్రీం తిరస్కరణకు గురైంది. అయితే, బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా చిదంబరం తరఫున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా చిదంబరం సందేశాన్ని ఆయన కోర్టుకు వినిపించారు.
"సీబీఐ, ఈడీ రోజువారీ పద్ధతిలో నా పరువు తీస్తున్నాయి. ఎవర్నయినా అరెస్ట్ చేస్తే ప్రజలు అతడ్ని దోషిగానే భావిస్తారు. అలాంటి పరిస్థితులు ఓ మనిషి జీవితాన్ని నాశనం చేస్తాయి. ఇప్పుడు సీబీఐ, ఈడీ కూడా అదే పని చేస్తున్నాయి. వాటి నుంచి నన్ను నేను కాపాడుకునే ఎలాంటి తరుణోపాయం నావద్ద లేదు" అంటూ తన సందేశంలో చిదంబరం పేర్కొన్నారు. కాగా, చిదంబరానికి ఈ నెల 30 వరకు సీబీఐ కస్టడీని సీబీఐ న్యాయస్థానం పొడిగించింది.