Nallamala: యురేనియం తవ్వకాలు వద్దు... ప్రభుత్వం నల్లమల అడవుల్ని కాపాడాలి: శేఖర్ కమ్ముల
- నల్లమలలో యురేనియం నిల్వలు
- తవ్వకాలు జరిపితే పర్యావరణం దెబ్బతింటుందని ఆందోళన
- క్యాన్సర్ రోగుల సంఖ్య మరింత పెరుగుతుందని ఫేస్ బుక్ లో పోస్టు
నల్లమల అటవీ ప్రాంతంలో పుష్కలంగా యురేనియం నిల్వలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అయితే, ఎంతో జీవ వైవిధ్యం కలిగిన నల్లమల అడవులు యురేనియం తవ్వకాలతో తీవ్రంగా నష్టపోతాయని ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లమల ప్రాంతంలో చెంచులు, ఇతర ఆదివాసీలు నివసిస్తున్నారని, అంతరించిపోతున్న పులులకు ఈ ప్రాంతం ఆవాసం కల్పిస్తోందని, అలాంటి ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపడితే సమూలంగా నాశనం అవుతుందని ఫేస్ బుక్ లో స్పందించారు.
యురేనియం తవ్వకాల కారణంగా కృష్ణా, దాని ఉపనదుల్లో కాలుష్యం పెరిగిపోవడమే కాకుండా, పరిసర ప్రాంతాల్లో క్యాన్సర్ రోగుల సంఖ్య మరింత పెరుగుతుందని అన్నారు. యురేనియం కోసం పర్యావరణాన్ని నాశనం చేసుకోవడం సబబు కాదని, ప్రభుత్వం వెంటనే స్పందించి నల్లమల అటవీ ప్రాంతాన్ని కాపాడుకునే చర్యలు తీసుకోవాలని శేఖర్ కమ్ముల విజ్ఞప్తి చేశారు.