RBI: చోర్ అన్న రాహుల్కు ప్రజలు బాగానే బుద్ధి చెప్పారు: నిర్మలా సీతారామన్
- చోర్, చోరీ వంటి పదాలు వాడడం మాకు చేతకాదు
- ఆ పదాలను వాడినందుకు ప్రజలు బాగానే బుద్ధి చెప్పారు
- ఆర్బీఐ నిధులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు
కేంద్రానికి భారీ స్థాయిలో నిధులు బదిలీ చేసేందుకు అంగీకరించిన భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)పై రాహుల్ గాంధీ చేసిన విమర్శలను కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ గట్టిగా తిప్పికొట్టారు. నిధుల బదిలీని రాహుల్ దోపిడీ అంటున్నారని, ఆయనలా తాను చోర్, చోరీ వంటి పనులను వాడబోనని తేల్చి చెప్పారు. అటువంటి పదాలను వాడడంలో రాహుల్ నిపుణుడన్న మంత్రి.. ఇటీవలి ఎన్నికల్లో ఆ పదాలను వాడినప్పటికీ ప్రజలు బాగానే బుద్ధి చెప్పారని అన్నారు. అయినా మళ్లీ ఆ పదాలనే ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించారు. ఆర్బీఐ నిపుణులతో వేసిన కమిటీని కాంగ్రెస్ ప్రశ్నించడం బాధాకరమన్న నిర్మల.. ఆర్బీఐ ప్రతిష్ఠకు భంగం కలిగించొద్దని కోరారు.
రిజర్వు బ్యాంకు నిధులపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఆ విషయమై ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేనని, వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాతే అన్ని విషయాలు వెల్లడిస్తామని నిర్మల పేర్కొన్నారు.