bihar: బాలికపై సామూహిక అత్యాచారం.. బాధితురాలికే గుండు కొట్టించిన పంచాయతీ పెద్దలు!
- బీహార్లోని గయ జిల్లాలో దారుణం
- బాధితురాలిపైనే అమానుషం
- ఆరుగురి అరెస్ట్
ఆరుగురి చేతిలో అత్యాచారానికి గురైన బాలికపై గ్రామ పెద్దలు మరింత దారుణంగా ప్రవర్తించారు. ఆమెపై సానుభూతి చూపి న్యాయం చేయాల్సిన పంచాయతీ పెద్దలు తిరిగి బాధితురాలికే గుండు కొట్టించి ఊరంతా ఊరేగించారు. బీహార్లోని గయ జిల్లా మసౌంధా గ్రామంలో జరిగిందీ అమానుష ఘటన. ఈ కేసులో పోలీసులు మంగళవారం ఆరుగురిని అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 14న సాయంత్రం కొందరు యువకులు ఓ వాహనంలో వచ్చి బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అనంతరం ఆమెను పంచాయతీ కార్యాలయ భవనంపైకి తీసుకెళ్లి అత్యాచారానికి తెగబడ్డారు. బాలిక స్పృహ కోల్పోయేంత వరకు వారు అఘాయిత్యానికి పాల్పడ్డారు. తర్వాత రోజు ఓ గ్రామస్థుడు బాలికను చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారొచ్చి ఆమెను తీసుకెళ్లారు.
విషయం బయటకు రావడంతో నిందితుల కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. పంచాయతీ పెద్దలపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో బాధితురాలికి న్యాయం చేయాల్సిన పెద్దలు.. తిరిగి ఆమెపై అమానుషంగా ప్రవర్తించారు. ఆమెనే తప్పుబట్టి గుండు కొట్టించి ఊరేగించారు. విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు స్పందించారు. ఘటన జరిగిన 11 రోజుల తర్వాత సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు అయింది. అది కూడా బాధితురాలు, ఆమె తల్లి శనివారం పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంచాయతీ నిర్వహించి, శిక్ష విధించిన ఐదుగురు కూడా ఇందులో ఉన్నారని మహిళా పోలీస్ స్టేషన్ అధికారి నిరంజన కుమారి తెలిపారు. అందరిపైనా పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. తనపై అత్యాచారానికి పాల్పడిన మిగతా ఐదుగురు నిందితులను బాలిక గుర్తించలేకపోతోందని పేర్కొన్నారు.