Seetharam Yechuru: జమ్మూ కశ్మీర్ వెళ్లేందుకు సీతారాం ఏచూరి, మరో విద్యార్థికి సుప్రీంకోర్టు అనుమతి

  • తల్లిదండ్రులను చూసేందుకు విద్యార్థికి అనుమతి
  • మిత్రుడిని కలిసేందుకు ఏచూరికి అనుమతి
  • ఏచూరిది రాజకీయపరమైన పర్యటన అని వాదించిన ప్రభుత్వ న్యాయవాది

జమ్మూ కశ్మీర్ పర్యటనకు వెళ్లేందుకు సీపీఎం నేత సీతారాం ఏచూరికి, తన తల్లిదండ్రులను చూసేందుకు వెళ్లాలనుకుంటున్న మరో విద్యార్థికి సుప్రీంకోర్టు అనుమతులు జారీ చేసింది. జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది.

ఈ సందర్భంగా అనంతనాగ్ లో ఉన్న తన తల్లిదండ్రులను చూసేందుకు జమ్మూ కశ్మీర్ వెళ్లేందుకు మొహమ్మద్ అలీమ్ సయీద్ అనే విద్యార్థికి సుప్రీంకోర్టు అనుమతించింది. అయితే, అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తాను శ్రీనగర్ వెళ్లలేకపోతున్నానని... తన తల్లిదండ్రులు ఎలా ఉన్నారో అని ఆందోళన చెందుతున్నానని... జమ్మూ కశ్మీర్ వెళ్లేందుకు తనను అనుమతించాలని సదరు విద్యార్థి పిటిషన్ వేశాడు.

మరోవైపు, తమ పార్టీ నేత మొహమ్మద్ యూసుఫ్ తరిగామీని కలిసేందుకు అక్కడకు వెళ్లేందుకు అనుమతించాలని సీతారాం ఏచూరి పిటిషన్ వేశారు. జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న తన మిత్రుడు తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారని... ప్రతి రోజు చికిత్స చేయించుకుంటున్నారని... అతన్ని కలిసేందుకు అనుమతించాలని పిటిషన్ లో కోరారు.

ఈ పిటిషన్ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ మాట్లాడుతూ, 'జమ్మూ కశ్మీర్ వెళ్లేందుకు మీకు అనుమతిస్తున్నాం. మీ స్నేహితుడిని కలిసేందుకే కదా మీరు వెళ్తున్నది? ఈ దేశానికి చెందిన ఒక పౌరుడు తన స్నేహితుడిని కలిసేందుకు వెళ్తున్నారు. దీనికి అభ్యంతరం ఎందుకు? కానీ, అక్కడ ఏదైనా సమస్యలో మీరు భాగస్వామి అయితే... అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది' అని హెచ్చరించారు.

మరోవైపు, సీతారాం ఏచూరికి అనుమతి ఇవ్వరాదని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. ఏచూరిది రాజకీయపరమైన పర్యటన అని... ఆయన అక్కడకు వెళ్తే, కశ్మీర్ లోని పరిస్థితులు ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News