cyber crime: కార్ల షోరూం యజమానినంటూ బ్యాంకుకు మస్కా.. రూ.8.2 లక్షలకు టోకరా!
- బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుతో రంగంలోకి సైబరాబాద్ పోలీసులు
- ఉత్తరప్రదేశ్ ముఠా పనిగా గుర్తించి వల
- నలుగురిని పట్టుకుని రూ.3 లక్షల నగదు, కారు, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం
ఓ కార్ల డీలర్ పేరు చెప్పి ఏకంగా బ్యాంకుకే బురిడీ కొట్టిన నలుగురు సైబర్ క్రైం నేరగాళ్లు పాపం పండి పోలీసుల వలకు చిక్కారు. వీరి వద్ద నుంచి 3 లక్షల రూపాయల నగదు, ఒక కారు, ఏడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రముఖ కార్ల షోరూంకు ఈనెల 9న ప్రధాన నిందితుడు అరుణ్‌కుమార్ ఫోన్ చేశాడు.
ఫోన్ లిఫ్ట్ చేసిన సేల్స్ సిబ్బందికి తనను తాను పెద్ద సంస్థకు యజమానిగా పరిచయం చేసుకున్నాడు. తమ సంస్థ అవసరార్థం పెద్దమొత్తంలో కార్లు కొంటున్నామని నమ్మబలికి, తమకు కొన్ని వివరాలు కావాలని అడిగాడు. పెద్ద బిజినెస్ లభిస్తోందన్న ఆశతో సేల్స్‌మేన్ సంస్థకు చెందిన మొత్తం వివరాలు చెప్పేశాడు. పనిలో పనిగా తమ సంస్థ బ్యాంకు అకౌంట్ వివరాలు కూడా తెలిపాడు. దీంతో ఓ ఖాళీ చెక్ పంపించాల్సింది కోరి ఫోన్ పెట్టేశాడు.
పెద్ద బిజినెస్ తలుపుతట్టిందని భావించిన సేల్స్‌మన్ అతను చెప్పినట్టే ఖాళీ చెక్కును వాట్సాప్‌లో పంపాడు. ఈ చెక్ అందిన తర్వాత సంస్థ అకౌంట్ ఉన్న బ్యాంక్‌కు ఫోన్ చేశాడు. బ్యాంక్ సీనియర్ మేనేజర్‌తో తనను తాను కార్ల షోరూం యజమానిగా పరిచయం చేసుకున్నాడు. కాసేపు అవీ ఇవీ మాట్లాడి పెద్ద మొత్తంలో మీ బ్యాంకులో డిపాజిట్ చేయాలని భావిస్తున్నట్లు తెలిపాడు. అప్పటికే షోరూం నుంచి భారీగా లావాదేవీలు జరుగుతుండడంతో అతను చెప్పింది నిజమేనని నమ్మిన సీనియర్ మేనేజర్ పెద్దమొత్తంలో డిపాజిట్ వస్తుందని ఆశపడ్డాడు.
మేనేజర్ తన మాయలో పడ్డాడని గుర్తించి సైబర్ కేటుగాడు తమ సంస్థ నుంచి అర్జంటుగా మరో సంస్థకు 8.2 లక్షలు బదిలీ చేయాల్సి ఉందని, షోరూం సిబ్బందితో చెక్కు పంపిస్తున్నానని, వీలైనంత వేగంగా డబ్బు సదరు అకౌంట్‌కు బదిలీ చేయాలని కోరాడు. భారీ మొత్తంలో డిపాజిట్ వస్తుందన్న ఆశలో ఉన్న బ్యాంక్ మేనేజర్ నిజానిజాలు నిర్థారించుకోకుండా అతను చెప్పిన అకౌంట్‌కు డబ్బు బదిలీ చేసేశాడు.
కానీ ఎప్పటికీ షోరూం సిబ్బంది చెక్కు పట్టుకుని రాకపోవడంతో అనుమానం వచ్చి షోరూంకు ఫోన్ చేసి ఆరాతీయగా అసలు మోసం బయటపడింది. దీంతో మరునాడు అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఖాతా వివరాల ద్వారా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముఠాపని అని గుర్తించి వలవేశారు.
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ జిల్లాకు చెందిన ప్రధాన నిందితుడు అరుణ్‌కుమార్ (30), ఢిల్లీ మయూర్ విహార్ వాసి లోకేష్ తోమార్ (33), గ్రేటర్ నోయిడాకు చెందిన మోహిత్ కుమార్(28), మీరట్‌కు చెందిన మనోజ్ కుమార్(35)లను అరెస్టు చేశారు. ఇంకా చాలా రాష్ట్రాల్లో వీరు మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు.