Pakistan: ఐక్యరాజ్యసమితికి రాసిన లేఖలో రాహుల్ గాంధీని వాడుకున్న పాకిస్థాన్.. లేఖలో ఏముందంటే..!
- జమ్మూ కశ్మీర్ లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి
- రాహుల్ గాంధీ కూడా ఇదే చెప్పారు
- జమ్మూ కశ్మీర్ లో ప్రజలు చనిపోతున్నారని చెప్పారు
జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని భారత్ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత... ఈ అంశాన్ని అంతర్జాతీయంగా వివాదాస్పదం చేసేందుకు పాకిస్థాన్ యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఐక్యరాజ్యసమితికి లేఖలను రాసింది. ఇందులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కూడా లాగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పలువురు ఐక్యరాజ్యసమితి అధికారులకు అందించిన ఈ లేఖను పాకిస్థాన్ మానవహక్కుల మంత్రి షిరీన్ మజారీ నిన్న విడుదల చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులను లేఖలో పేర్కొన్నారు.
"జమ్మూ కశ్మీర్ లో ఎన్నో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. భారత్ కు చెందిన కీలక రాజకీయ నాయకులు కూడా ఇదే చెబుతున్నారు. జమ్మూ కశ్మీర్ లో ప్రజలు చనిపోతున్నారని, పరిస్థితులు హింసాత్మకంగా మారుతున్నాయని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పారు." అని లేఖలో పాకిస్థాన్ పేర్కొంది. జమ్మూ కశ్మీర్ లోని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లాల పేర్లను కూడా లేఖలో ఉటంకించింది. మరోవైపు రాహుల్ గాంధీని ప్రస్తావించడంతో పాకిస్థాన్ పై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.