congress: రాహుల్ లాంటి నేత ఉండడం మన దురదృష్టం: బీజేపీ నేత స్మృతీ ఇరానీ
- పాక్ కు అనుకూలంగా రాహుల్ మాట్లాడుతున్నారు
- భారత్ కంటే పాకిస్థాన్ పైనే ఆయన ప్రేమ ఎక్కువైంది
- అమేథీలో పర్యటించిన స్మృతీ ఇరానీ
జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని భారత్ ప్రభుత్వం రద్దు చేసిన విషయాన్ని అంతర్జాతీయంగా వివాదాస్పదం చేసేందుకు పాకిస్థాన్ యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఐక్యరాజ్యసమితికి లేఖలను రాసింది. ఈ లేఖల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేరును ప్రస్తావించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రాహుల్ పై కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత స్మృతి ఇరానీ నిప్పులు చెరిగారు. అమేథీ నియోజకవర్గంలో ఈరోజు ఆమె పర్యటించారు.
ఈ సందర్భంగా స్మృతి ఇరానీ మాట్లాడుతూ, పాకిస్థాన్ కు అనుకూలంగా రాహుల్ మాట్లాడుతున్నారని, భారత్ కంటే పాకిస్థాన్ పైనే ఆయనకు ప్రేమ ఎక్కువైందని వ్యాఖ్యానించారు. మనకు రాహుల్ లాంటి నేత ఉండడం దురదృష్టకరమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ నుండి పాకిస్థాన్ మద్దతు పొందడం ఇదేమీ మొదటిసారి కాదని, గతంలో కూడా ఇలాంటి ఘటనలు ఉన్నాయని విమర్శించారు.