Rajnath Singh: భారత్ ను నాశనం చేయాలనుకుంటున్న పాకిస్థాన్ తో ఏం మాట్లాడతాం?: రాజ్ నాథ్ సింగ్
- కశ్మీర్ పై పడి ఏడవడాన్ని పాక్ ఆపేయాలి
- ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలి
- పీవోకేలో మానవహక్కుల ఉల్లంఘనలపై పాక్ మాట్లాడాలి
పాకిస్థాన్ పై భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మరోసారి మండిపడ్డారు. భారత్ ను నాశనం చేయాలని చూస్తున్న ఆ దేశంతో ఏం మాట్లాడతామని ఆయన ప్రశ్నించారు. పాక్ తో మంచి సంబంధాలనే భారత్ కోరుకుంటోందని చెప్పారు. పాకిస్థాన్ ఏర్పడినప్పటి నుంచి ఆ దేశ ఉనికిని భారత్ గౌరవిస్తూనే ఉందని అన్నారు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు పాకిస్థాన్ మొదట కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత లడాఖ్ లో రాజ్ నాథ్ తొలిసారి పర్యటించారు. అక్కడ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసర్చ్ నిర్వహించిన 26వ 'కిసాన్-జవాన్ విజ్ఞాన్ మేళా'ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
కశ్మీర్ భారత్ లో ఎప్పటికీ అంతర్భాగమేనని రాజ్ నాథ్ చెప్పారు. పాకిస్థాన్ ను తాను ఒకటే అడుగుతున్నానని... కశ్మీర్ వారిది ఎప్పుడయిందో చెప్పాలని ఎద్దేవా చేశారు. కశ్మీర్ పై పడి ఏడవటాన్ని ఆ దేశం ఆపేయాలని అన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో చోటుచేసుకుంటున్న మానవహక్కుల ఉల్లంఘనలపై పాకిస్థాన్ మాట్లాడాలని సూచించారు. జమ్ముకశ్మీర్ విషయంలో ప్రపంచంలోని ఏ దేశం కూడా పాకిస్థాన్ కు మద్దతును ప్రకటించలేదని అన్నారు.