west indies: రాణించిన మయాంక్, కోహ్లీ.. భారత్ 264/5
- ఉసూరుమనిపించిన లోకేశ్ రాహుల్
- అర్ధ సెంచరీలతో ఆదుకున్న మయాంక్, కోహ్లీ
- మూడు వికెట్లు పడగొట్టిన విండీస్ కెప్టెన్
వెస్టిండీస్‌తో కింగ్స్టన్లోని సబీనా పార్క్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. పిచ్‌పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకున్న విండీస్ బౌలర్లు భారత్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టారు.
32 పరుగుల వద్ద లోకేశ్ రాహుల్ (13), 46 పరుగుల వద్ద చటేశ్వర్ పుజారా (6) అవుటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. మరోవైపు క్రీజులో కుదురుకున్న మయాంక్ అర్ధ సెంచరీ (55) పూర్తి చేసుకున్న తర్వాత హోల్డర్ బౌలింగ్‌లో కార్న్‌వాల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రహానే (24) కూడా ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు.
మరోవైపు, సెంచరీ దిశగా వెళ్తున్న కోహ్లీ 76 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హోల్డర్ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. హనుమ విహారి 42, రిషభ్ పంత్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ కోల్పోయిన ఐదు వికెట్లలో మూడు విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్‌కే దక్కాయి.