Chandrababu: ఆ రూ.18 లక్షల లెక్క తేల్చండి: జగన్ సర్కారుకు చంద్రబాబు ప్రశ్న
- తెలుగు భాషా దినోత్సవం కోసం కేటాయించిన సొమ్ము ఏమైందని ప్రశ్న
- ’మా తెలుగు తల్లి..‘ పాట వినిపించడం లేదని ఆవేదన
- ఏమిటీ రాష్ట్ర దౌర్భాగ్యం అంటూ ట్వీట్
ఏపీలోని వైసీపీ సర్కారుపై చంద్రబాబు మరోమారు మండిపడ్డారు. ట్విట్టర్లో చురుగ్గా ఉండే మాజీ ముఖ్యమంత్రి మరోమారు తాజాగా తెలుగు భాషా దినోత్సవంపై తీవ్రంగా స్పందించారు. తెలుగు భాషా దినోత్సవం కోసం కేటాయించిన రూ.18 లక్షలు ఏం చేశారని ప్రశ్నించిన చంద్రబాబు.. తెలుగు భాషా దినోత్సవం రోజున తెలుగుతల్లి విగ్రహానికి దండ వేసే నాథుడు కూడా కరవయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని తన ట్వీట్‌కు జతపరిచారు.
‘తెలుగు భాషా దినోత్సవం రోజున, విజయవాడ నడిబొడ్డున ఉన్న తెలుగుతల్లి విగ్రహానికి కనీసం పూలమాల వేసేవారు కూడా లేరంటే, ఈ ప్రభుత్వం తెలుగు భాషకు ఇస్తున్న ప్రాధాన్యత అర్థమవుతుంది. తెలుగు భాషాదినోత్సవానికి ప్రభుత్వం విడుదల చేసిన రూ.18 లక్షలతో ఏం చేసినట్టు?’ అని ప్రశ్నించారు.
‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ.. మా కన్నతల్లికి మంగళారతులు.. అంటూ ఆంధ్రులు గర్వంగా పాడుకునే రాష్ట్ర గీతం... ఈ మూడు నెలల్లో ఒక్క అధికారిక కార్యక్రమంలో అయినా వినిపించిందా? ఏమిటీ రాష్ట్ర దౌర్భాగ్యం?’ అని మరో ట్వీట్లో ఆవేదన వ్యక్తం చేశారు.