Andhra Bank: ఆంధ్రా బ్యాంకును విలీనం చేయొద్దు, పేరు మార్చొద్దు... ఇది మా తెలుగువాళ్ల సెంటిమెంటు: నిర్మలా సీతారామన్ కు లేఖ రాసిన కేవీపీ
- ఆంధ్రా బ్యాంకును ఇతర బ్యాంకుల్లో విలీనం చేయాలని కేంద్రం నిర్ణయం
- వ్యతిరేకిస్తున్న తెలుగు ఎంపీలు
- విలీనం తప్పనిసరైతే కనీసం పేరునైనా కొనసాగించాలని విజ్ఞప్తి
కేంద్రం బ్యాంకుల విలీన ప్రక్రియలో భాగంగా ఆంధ్రా బ్యాంకును కార్పొరేషన్ బ్యాంకుతో కలిసి యూనియన్ బ్యాంకులో విలీనం చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా, తెలుగు ఎంపీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. తాజాగా, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు.
ఆంధ్రా బ్యాంకును విలీనం చేయొద్దని, ఆంధ్రా బ్యాంకు అనే పేరు మార్చొద్దని, ఇది తెలుగు వాళ్ల సెంటిమెంటుతో ముడిపడిన అంశమని ఆయన తన లేఖలో స్పష్టం చేశారు. ఒకవేళ విలీనం తప్పనిసరైనా, పేరు మాత్రం పాతదే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగువాళ్ల సెంటిమెంట్ ను కేంద్రం గౌరవించాలని కేవీపీ స్పష్టం చేశారు. ఇదే తరహాలో మచిలీపట్నం వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా కేంద్రానికి లేఖ రాశారు.
ఆయన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను ఉద్దేశించి లేఖ రాశారు. స్వాతంత్ర్యం రాక ముందు నుంచి ఉన్న బ్యాంకును ఇతర బ్యాంకులతో కలపొద్దని అన్నారు. ఆంధ్రా బ్యాంకు తెలుగుప్రజల కీర్తిప్రతిష్ఠలకు కేంద్రం అని వెల్లడించారు. 1923 నవంబరు 20న మచిలీపట్నం కేంద్రంగా ఆంధ్రా బ్యాంకు పురుడు పోసుకుంది. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య దీనిని స్థాపించారు.