BJP: అమరావతిపై బీజేపీ మాట మార్చింది : బొత్స ఫైర్
- ఆనాడు ఐదు వేల ఎకరాలు చాలన్నారు
- రైతుల నుంచి భూముల బలవంతంగా లాక్కున్నారని విమర్శించారు
- ఇప్పుడు టీడీపీ నేతలకు వంతపాడుతున్నారని ధ్వజం
భారతీయ జనతా పార్టీ నాయకులపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి విషయంలో ఆ పార్టీ నాయకుల వైఖరి భిన్నంగా ఉందని విమర్శించారు. ఒకప్పుడు టీడీపీ తీరుపై విమర్శించిన వారే ఇప్పుడు వంతపాడుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.
ఈరోజు ఉదయం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ‘రాజధాని కోసం రైతుల నుంచి టీడీపీ ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటోంది అన్నది మీరు కాదా. రాజధానికి ఐదువేల ఎకరాలు సరిపోతుందని, 36 వేల ఎకరాలు ఎందుకని విమర్శించింది మీరు కాదా? అమరావతి ముంపు ప్రాంతం, భారీ స్థాయిలో అవినీతి జరుగుతోంది అని వ్యాఖ్యానించింది మీరు కాదా?, మరి ఇప్పుడు ఎందుకీ డొంక తిరుగుడు వ్యాఖ్యానాలు’ అని బొత్స ప్రశ్నించారు.
టీడీపీ ప్రభుత్వం హయాంలో భారీగా అవినీతి జరిగిందని, అవినీతి పరుల పేర్లు బయటపెట్టమని ఎందుకు బీజేపీ నేతలు డిమాండ్ చేయడం లేదని బొత్స ప్రశ్నించారు.