Andhra Pradesh: పవన్ కల్యాణ్ పై బొత్స ఎదురుదాడి చేయడం ఏమిటి?: సీపీఐ రామకృష్ణ
- రాజధానిపై బొత్స గందరగోళం రేకెత్తించారు
- అవినీతి జరిగి వుంటే చర్యలు తీసుకోండి
- విజయవాడలో మీడియాతో సీపీఐ నేత
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరిని ఏపీ మంత్రి బొత్స ఇటీవల తప్పుపట్టిన సంగతి తెలిసిందే. జనసేన పార్టీ అజెండా ఇంకా మారలేదనీ, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని బొత్స విమర్శించారు. అంతేకాకుండా చంద్రబాబు ఆర్థిక వ్యవహారాలకు పవన్ మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. తాజాగా ఈ విమర్శలను సీపీఐ నేత రామకృష్ణ ఖండించారు. రాజధాని విషయంలో మంత్రి బొత్స గందరగోళాన్ని రేకెత్తించారని రామకృష్ణ విమర్శించారు. ఈరోజు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.
రాజధాని విషయంలో క్లారిటీ ఇవ్వని బొత్స.. ఇప్పుడు పవన్ కల్యాణ్ పై ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించాలనీ, వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రాజధాని అమరావతి విషయంలో ఏమైనా అవినీతి జరిగిఉంటే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.