Andhra Pradesh: వైఎస్ నా రాజకీయ గురువు.. ఎల్లవేళలా వెన్నుతట్టి ప్రోత్సహించారు!: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- నేడు వైఎస్ వర్థంతి
- నివాళులు అర్పించిన కోమటిరెడ్డి
- తెలంగాణలోనూ వైఎస్ కు అభిమానులు ఉన్నారని వ్యాఖ్య
తెలంగాణ కాంగ్రెస్ నేత, లోక్ సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో నీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన ఘనత వైఎస్సార్ దేనని తెలిపారు. తన హయాంలో వైఎస్ ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారని వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఈరోజు కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి తెలంగాణలోనూ అభిమానులు ఉన్నారని కోమటిరెడ్డి తెలిపారు. వైఎస్ తన రాజకీయ గురువనీ, ఎల్లవేళలా తనను వెన్నంటి ప్రోత్సహించారని గుర్తుచేసుకున్నారు.
రైతులకు ఉచిత విద్యుత్, పేదల పాలిట వరంగా నిలిచిన 108 సేవలను వైఎస్ తీసుకొచ్చారని చెప్పారు. ‘రైతు బాంధవుడు, జలయజ్ఞం ద్వారా రైతాంగానికి సాగునీరు ఇవ్వాలని దృఢ సంకల్పంతో ఉన్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ చేపట్టిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుంది. ముచ్చర్లలో పార్మ సిటీ ఏర్పాటు చేశారు. కాళేశ్వరానికి పెట్టిన బాహుబలి మోటార్లు తెచ్చింది కూడా వైఎస్ రాజశేఖరరెడ్డే. వైఎస్ పథకాలను కేసీఆర్ కాపీ కొట్టారు’ అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.