Andhra Pradesh: ‘కాణిపాకం’లో సామాన్య భక్తులకు చుక్కలు చూపించిన ఆలయ అధికారులు!
- వీఐపీల సేవల్లో తరించిన సిబ్బంది
- రూ.50, రూ.100 టికెట్ల క్యూలైన్లు కలిపివేత
- కనీసం మంచినీటి సౌకర్యాన్ని కూడా కల్పించని వైనం
కాణిపాకం వినాయక ఆలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన వేళ అధికారుల నిర్లక్ష్యం పూర్తిగా బయటపడింది. నేడు వినాయక చవితి నేపథ్యంలో భారీగా సామాన్య భక్తులు చిత్తూరులోని స్వామివారి ఆలయానికి తరలిరాగా, పట్టించుకునే అధికారులే కరువయ్యారు. వీఐపీ, వీవీఐపీల సేవల్లో తరించిన ఆలయ అధికారులు సామాన్య భక్తులకు కనీసం మంచినీటి వసతిని కూడా ఏర్పాటు చేయలేదు.
దీనికితోడు రూ.50, రూ.100 టికెట్ల క్యూలైన్లను కలిపివేయడంతో తొక్కిసలాట జరిగి భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ సందర్భంగా ఓ మహిళ కళ్లు తిరిగిపడిపోగా, అధికారులెవరూ పట్టించుకోలేదు. ఆలయ క్యూలైన్లలో భక్తులు 2-3 గంటల పాటు ఆగిపోవాల్సి వచ్చింది. దీంతో అధికారుల తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఐపీలకు ప్రాధాన్యత ఇచ్చి సామాన్యుల క్యూలైన్లను నిలిపివేశారని మండిపడ్డారు.