Hen: పెంచుకున్న కోడి... ప్రాణాలు తీసింది!
- ఆస్ట్రేలియాలో ఘటన
- గుడ్లను తీస్తోందని దాడి చేసిన కోడి
- తీవ్ర రక్తస్రావమై వృద్ధురాలి మృతి
ఓ వృద్ధురాలు ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ఓ కోడి, ఆమె ప్రాణాలు తీసింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. స్థానిక మీడియా, ఫోరెన్సిక్ నిపుణులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఓ వృద్ధ మహిళ, కోడిని పెంచుకుంటోంది. ఆమె దాని గుడ్లను సేకరిస్తున్న సమయంలో, కోపాన్ని తెచ్చుకున్న కోడి, తన పదునైన ముక్కుతో ఆమెను పదేపదే గాయపరిచింది.
దీంతో ఆ వృద్ధురాలి శరీరంలో పలు చోట్ల గాయాలు అయ్యాయి. చాలా సేపటి వరకూ ఆమెకు వైద్య చికిత్స అందలేదు. రక్తం అధికంగా పోవడంతో ఆమె మరణించింది. పెంపుడు జంతువులతో జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటన మరోసారి చెబుతోందని, కేసును అధ్యయనం చేసిన ఫోరెన్సిక్ నిపుణుడు రోజర్ బైర్డ్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా వయసు పైబడినవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కేసులో మృతురాలి పేరు, ఇతర వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు.