Kia: ఆరంభంలోనే అదరగొట్టిన 'కియా'... టాప్-7లో స్థానం!
- గత నెలలో విడుదలైన కియా సెల్టోస్
- 6,200 యూనిట్ల అమ్మకాలు
- తొలి స్థానాన్ని నిలుపుకున్న మారుతి సుజుకి
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'కియా మోటార్స్ ఇండియా' ఆరంభంలోనే అదరగొట్టింది. ఈ రంగంలో దిగ్గజాలుగా పేరున్న ఫోర్డ్, రెనాల్ట్, నిస్సాన్, స్కోడా వంటి కంపెనీలను వెనక్కు నెట్టేసింది. ఇండియాలో అత్యధికంగా కార్లను విక్రయిస్తున్న సంస్థల్లో ఏడో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ ఏర్పడిన సంగతి తెలిసిందే. తన తొలి కారుగా, సెల్టోస్ ను మార్కెట్లోకి విడుదల చేయగా, బుకింగ్స్ అద్భుతంగా నడిచాయి. ఇదే సమయంలో మార్కెట్లోకి అడుగుపెట్టిన ఎంజీ మోటార్స్ కస్టమర్లను మెప్పించలేక, 11వ స్థానంతో సరిపెట్టుకుంది.
ఇదిలావుండగా, ఆగస్టు నెల అమ్మకాల్లోనూ మారుతి సుజుకి తన అగ్రస్థానాన్ని కొనసాగించింది. ఈ నెలలో మొత్తం 95,506 యూనిట్లను విక్రయించి, మిగతా కంపెనీలతో పోలిస్తే ముందుంది. ఇక 38,205 యూనిట్లతో హ్యుందాయ్ రెండో స్థానంలో నిలిచింది. ఆపై 13,507 యూనిట్లతో ఎంఅండ్ ఎం మూడో స్థానంలో కొనసాగింది. ఇక కియా కార్లు మోత్తం 6,200 యూనిట్ల అమ్మకాలు కాగా, ఇది మొత్తం కార్ల కంపెనీలతో పోలిస్తే, ఏడో స్థానం. ఆ తరువాతి స్థానాల్లో రెనాల్ట్ (5,700), ఫోర్డ్ (5,517), ఫోక్స్ వ్యాగన్ (2,300) కంపెనీలున్నాయి. సెల్టోస్ తో పాటు హెక్టార్ అనే వెహికిల్ తో వచ్చిన ఎంజీ మోటార్స్ కేవలం 2 వేల బుకింగ్స్ కు మాత్రమే పరిమితమైంది.