L.B.sriram: నటుడిగా నాకు వచ్చిన పేరు ప్రతిష్ఠలు ఈవీవీ గారి చలవే: ఎల్బీ శ్రీరామ్
- రచయితగా ఈవీవీ గారు ప్రోత్సహించారు
- కృష్ణవంశీ ఆ సలహా ఇచ్చారు
- నటుడిగా లైఫ్ ఇచ్చింది ఈవీవీ గారే
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ, తాను నటుడిగా మారిన తీరును గురించి ప్రస్తావించారు. "తొలినాళ్లలో చిత్రపరిశ్రమలో రచయితగా నా ప్రయాణం కొనసాగుతూనే వుంది. అయితే నటుడిగా నా ప్రతిభను పూర్తిస్థాయిలో ఆవిష్కరించాలనే తపన మొదలైంది. దాంతో కొన్ని ఫొటోలు తీయించుకుని కృష్ణవంశీగారి దగ్గరికి వెళ్లి వేషం అడిగాను. కథను బట్టే తను నటీనటులను ఎంచుకుంటాననీ, ఈవీవీ అయితే తప్పకుండా ఛాన్స్ ఇస్తాడని కృష్ణవంశీ అన్నారు.
రచయితగా నేను ఈవీవీ గారికి బాగా తెలుసు, అందువలన నటుడిగా ఆయన అవకాశం ఇస్తాడో లేదోననే సందేహంతోనే వెళ్లాను. నేను తీయించుకున్న ఫొటోలను ఈవీవీ గారికి చూపించాను. ఆయన కొన్ని ఫొటోలు తీసుకుని తన డెస్క్ లో పెట్టుకున్నారు. ఆ తరువాత 'చాలా బాగుంది' సినిమాలో ఆయన ఇచ్చిన వేషం నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా నుంచి నటుడిగా నేను వెనుదిరిగి చూసుకోలేదు. రచయితగా .. నటుడిగా నేను ఎదగడానికి కారకులు ఈవీవీ గారే" అని చెప్పుకొచ్చారు.