Jagan: సీఎం జగన్ నిర్ణయం చారిత్రాత్మకం... స్వాగతిస్తున్నాం: ఏపీ ఎన్ఎంయూ అధ్యక్షుడు రమణారెడ్డి
- ప్రభుత్వ నిర్ణయంతో 53 వేలమంది కార్మికులకు మేలు జరుగుతుందన్న ఎన్ఎంయూ నేత
- ఆర్టీసీ కార్మికులు జీవితాంతం సీఎం జగన్ కు రుణపడి ఉంటారంటూ వ్యాఖ్యలు
- అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే కీలక నిర్ణయం తీసుకున్నారంటూ కితాబు
ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే కాకుండా, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించేందుకు ఏపీ సర్కారు సుముఖత వ్యక్తం చేయడం పట్ల ఎన్ఎంయూ (నేషనల్ మజ్దూర్ యూనియన్) ఏపీ అధ్యక్షుడు రమణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా 53 వేల మంది ఆర్టీసీ కార్మికులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు వైఎస్ జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటారని రమణారెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే కీలక నిర్ణయం తీసుకున్న ఘనత సీఎం జగన్ కే చెల్లిందని వ్యాఖ్యానించారు.