smart phone: స్మార్ట్‌ఫోన్ కొనివ్వమన్న కొడుకు.. మందలించిన తండ్రి.. రైలుకిందపడి ప్రాణాలు తీసుకున్న యువకుడు
- రూ. 60 వేల స్మార్ట్‌ఫోన్‌ను పోగొట్టుకున్న విద్యార్థి
- రూ.80 వేల విలువ చేసే ఫోన్ కొనివ్వాలని పట్టు
- సమయం అడగడంతో మనస్తాపంతో ఆత్మహత్య
స్మార్ట్‌ఫోన్ కొనివ్వలేదన్న మనస్తాపంతో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్స్ చేస్తున్న ఓ విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురంలోని గుల్జార్‌పేటకు చెందిన యశ్వంత్‌రెడ్డి (20) బెంగళూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో హోటల్ మేనేజ్‌మెంట్ చదువుతున్నాడు.
వినాయకచవితి సందర్భంగా యశ్వంత్‌రెడ్డి తాడిపత్రిలోని తమ బంధువుల ఇంటికి వచ్చాడు. యశ్వంత్‌రెడ్డి ఇటీవల తన వద్ద ఉన్న రూ.65 వేల విలువ చేసే సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. తనకు కొత్తగా రూ.80 వేల విలువ చేసే ఫోన్ కొనివ్వాలంటూ గత కొంతకాలంగా తండ్రిని అడుగుతున్నాడు.
నెల రోజుల్లో కొనిస్తానని, అప్పటి వరకు ఆగాలని కుమారుడిని తండ్రి జయరామరెడ్డి కోరాడు. అందుకు నిరాకరించిన యశ్వంత్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో అయినా ఫోన్ కొనివ్వాలని అడిగాడు. దీనికి నిరాకరించిన జయరామరెడ్డి కుమారుడిపై కోప్పడ్డాడు. దీంతో మనస్తాపం చెందిన యశ్వంత్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సోమవారం యశ్వంత్ కోమలి వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.