Karnataka: డీకే శివకుమార్ అరెస్టుతో అట్టుడుకుతున్న కర్ణాటక!
- నిన్న శివకుమార్ అరెస్ట్
- పలు ప్రాంతాల్లో రోడ్డెక్కిన కాంగ్రెస్ కార్యకర్తలు
- భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ ను మనీ లాండరింగ్ కేసులో నిన్న అరెస్ట్ చేయగా, ఈ ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శివకుమార్ అరెస్ట్ రాజకీయ కక్షపూరిత చర్యేనని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ నేతలు నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్డెక్కిన కార్యకర్తలు బస్సులను అడ్డుకున్నారు. పలు చోట్ల స్వల్ప ఉద్రిక్త సంఘటనలు జరుగగా, పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.
బెంగళూరు, బళ్లారి, దావణగెరె, శివమొగ్గ, సింథనూరు తదితర ప్రాంతాలతో పాటు, శివకుమార్ అనుచరవర్గం అధికంగా ఉన్న చోట్ల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తమ నేతను బీజేపీ కావాలనే టార్గెట్ చేసిందని మాజీ సీఎం సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన్ను వెంటనే వదిలివేయాలని డిమాండ్ చేశారు.
కాగా, ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన శివకుమార్ ను ఈ ఉదయం ఆసుపత్రిలో పరీక్షల అనంతరం కోర్టులో హాజరు పరచనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పకుండా చూస్తామని, ఎక్కడికక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని, ఆందోళనకారులు తెగిస్తే, చూస్తూ ఊరుకోబోయేది లేదని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు.