Moonwalk: ‘మూన్‌వాక్’ తర్వాత రోడ్లపై గుంతలు పూడ్చిన బెంగళూరు అధికారులు
- రోడ్లపై గుంతలకు నిరసనగా ఆర్టిస్ట్ ‘మూన్‌వాక్’
- 24 గంటల్లోనే గుంతలు పూడ్చిన అధికారులు
- థ్యాంక్స్ చెప్పిన ఆర్టిస్ట్ నంజుండస్వామి
బెంగళూరు రోడ్లపై బిలం పరిమాణంలో ఉన్న గుంతలకు నిరసనగా ఓ వ్యక్తి చేసిన ‘మూన్‌వాక్’ వీడియో వైరల్ అయింది. దీంతో స్పందించిన అధికారులు 24 గంటల్లోపే వాటిని పూడ్చిపెట్టారు. నగరానికి చెందిన ఆర్టిస్ట్ బాదల్ నంజుండస్వామి సోమవారం తన ట్విట్టర్ ఖాతాలో రోడ్లపై ఉన్న గుంతలపై ‘మూన్‌వాక్’ చేస్తున్న వీడియోను పోస్టు చేశాడు. ఆ వీడియో చూసినవారు నిజంగా అది చంద్రుడి ఉపరితలమేనని భావించారు. అంతగొప్పగా నంజుండస్వామి దానిని షూట్ చేశాడు. పెద్దపెద్ద పాత్‌హోల్స్ చూసి అది గ్రహమేనని నిర్ధారణకొచ్చారు. అయితే, అదే సమయంలో ఓ ఆటో ఆ పక్కగా వెళ్లడంతో అది రోడ్డేనని తేలింది.
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. పదిలక్షల మందికిపైగా దీనిని వీక్షించారు. చివరికి ఇది బెంగళూరు మునిసిపల్ అధికారుల దృష్టికి చేరడంతో వారు యుద్ధ ప్రాతిపదికన రోడ్లపై గుంతలు పూడ్చివేసే కార్యక్రమం చేపట్టారు. బెంగళూరు అధికారుల స్పందనకు నంజుండస్వామి కృతజ్ఞతలు తెలిపాడు. వేగంగా స్పందించి రోడ్లపై గుంతలు పూడ్చినందుకు బెంగళూరు మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనిల్ కుమార్, మేయర్ ప్రభాకర్, సిబ్బందికి థ్యాంక్స్ చెప్పాడు.