Jana Sena: పవన్ కల్యాణ్ అన్యాయం చేశాడంటూ.... రాత్రంతా గొలుసులతో బంధించుకున్న జూనియర్ ఆర్టిస్ట్ సునీత!
- ఆదుకుంటానని చెప్పి వాడుకున్నారు
- జనసేన కోసం కష్టపడితే తప్పుడు కేసులు పెట్టారు
- ఫిల్మ్ చాంబర్ లో బోయ సునీత ఆందోళన
- ప్రచారం కోసమేనంటున్న జనసేన
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, తన సేవలను వాడుకుని, ఆపై అన్యాయం చేశాడని ఆరోపిస్తూ, ఓ జూనియర్ ఆర్టిస్ట్, హైదరాబాద్, జూబ్లీహిల్స్ లోని ఫిల్మ్ చాంబర్ కార్యాలయంలో రాత్రంతా తనను తాను బందీగా చేసుకుని ఉండిపోయిన ఘటన కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ వద్దకు నిన్న సాయంత్రం వచ్చిన బోయ సునీత అనే యువతి, పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేస్తూ, ఓ గదిలోకి వెళ్లి, లోపలి నుంచి తలుపులు వేసుకుని, తనను తాను బంధించుకుంది. ఆమెను బయటకు రప్పించేందుకు పలువురు ప్రయత్నించి విఫలమయ్యారు. పవన్ స్వయంగా వచ్చి సమాధానం ఇస్తేనే తాను బయటకు వస్తానని భీష్మించుకుని కూర్చుంది.
ఈ విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు, ఉదయం 6 గంటల సమయంలో ఫిల్మ్ చాంబర్ కార్యాలయానికి వచ్చి, బలవంతంగా తలుపులు తెరిచి, ఆమెను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జనసేన పార్టీ కోసం తాను అహర్నిశలూ శ్రమించానని, తనను ఆదుకుంటానని చెప్పి వాడుకుని, ఇప్పుడు తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించింది.
కాగా, బోయ సునీత, గతంలోనూ హైదరాబాద్ లోని పవన్ కార్యాలయం ముందు ఆయన్ను కలవాలంటూ హడావిడి చేసింది. అయితే, పవన్ ఆమెను కలవలేదు. ఈ నేపథ్యంలో ఇదంతా పబ్లిసిటీ స్టంటేనని, ప్రచారం కోసమే ఆమె ఇలా చేస్తోందని జనసేన వర్గాలు అంటున్నాయి.