Mohammed Shami: డేరా బాబా, ఆశారాం బాపూలే తప్పించుకోలేకపోయారు.. షమీ వెనుక పెద్ద క్రికెటర్లు ఉన్నారు: హసీన్ జహాన్

  • ఏడాదిన్నరగా న్యాయం కోసం పోరాడుతున్నా
  • షమీ చేసిన తప్పులు నిరూపితమవుతాయి
  • చేసిన తప్పులకు అతను మూల్యం చెల్లించుకోవాల్సిందే

టీమిండియా ఆటగాడు మొహమ్మద్ షమీపై అరెస్ట్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే. గృహ హింసకు సంబంధించి అతని భార్య హసీన్ జహాన్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ వారెంట్ జారీ అయింది. ఈ నేపథ్యంలో హసీన్ మాట్లాడుతూ, డేరా బాబా రామ్ రహీం, ఆశారాం బాపూలే చట్టం నుంచి తప్పించుకోలేకపోయారని... ప్రస్తుతం శిక్షను అనుభవిస్తున్నారని... వారి ముందు షమీ ఎంత అని ప్రశ్నించారు. షమీకి బీసీసీఐతో పాటు కొందరు పెద్ద క్రికెటర్ల మద్దతు ఉందని... వారి అండ చూసుకునే షమీ నిశ్చింతగా ఉంటున్నాడని... లేకపోతే చేసిన తప్పులను ఇప్పటికే గ్రహించేవాడని తెలిపారు. ఇది ఎంతో కాలం కొనసాగదని చెప్పారు.

ఏడాదిన్నర కాలంగా తనకు జరిగిన అన్యాయంపై తాను పోరాడుతున్నానని హసీన్ తెలిపారు. ఆర్థికంగా తాను బలవంతురాలిని కాదని, తనకు ఎలాంటి సపోర్ట్ కూడా లేదని వాపోయారు. నానాటికీ తనకు నమ్మకం సడలిపోయిందని... కానీ, దేవుడి దయవల్ల ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని చెప్పారు. షమీపై తాను చేసిన ఆరోపణలు నిరూపితమవుతాయని... చట్టం అందరికీ సమానమేనని అన్నారు. తన బాధను అర్థం చేసుకుని, తనకు కోర్టు న్యాయం చేసిందని చెప్పారు. షమీకి పెద్ద వ్యక్తుల నుంచి సపోర్ట్ ఉందని... కానీ, అది అతను చేసిన తప్పులను కప్పిపుచ్చలేదని తెలిపారు. చేసిన తప్పులకు షమీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని చెప్పారు.  

షమీ, అతని సోదరుడు హసీద్ అహ్మద్ లకు అలీపూర్ లోని అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 15 రోజుల్లోగా లొంగిపోయి, బెయిల్ కు అప్పీల్ చేసుకోవాలని సూచించింది. ఈ కేసుకు సంబంధించి వాదనలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సోదరులు ఇద్దరూ ఒక్కసారి కూడా కోర్టుకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో, వారికి అరెస్ట్ వారెంట్ జారీ అయింది.

  • Loading...

More Telugu News