DMK: ఇలాంటి బలహీన వృద్ధి రేటును గత 27 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదు: కేంద్రంపై స్టాలిన్ మండిపాటు
- ఆర్థిక మందగమనాన్ని దాచి పెట్టేందుకు కశ్మీర్ అంశాన్ని వాడుకుంటోంది
- చిదంబరం అరెస్ట్ కూడా అందులో భాగమే
- పరిస్థితి దారుణంగా ఉన్నా ఆ వార్తలు మీడియాలో రావు
కేంద్ర ప్రభుత్వంపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో జీడీపీ వృద్ధి రేటు ఘోరంగా పడిపోయిందని పేర్కొన్న ఆయన.. ఆర్థిక మందగమనాన్ని దాచి పెట్టేందుకు చిదంబరం అరెస్ట్, కశ్మీర్ అంశాలను కేంద్రం వాడుకుంటోందని ఆరోపించారు. జూన్ త్రైమాసికానికి స్థూల జాతీయోత్పత్తి 5 శాతానికి పడిపోయిందని, గత 27 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి బలహీన వృద్ధి రేటును చూడలేదన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతున్నా.. ఆ వార్తలు మాత్రం అటు ప్రింట్ మీడియాలో కానీ, ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ రాకపోవడం దారుణమన్నారు.
భారత జీడీపీ వృద్ధి రేటు వరుసగా ఐదో త్రైమాసికంలోనూ పడిపోయింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి 5 శాతానికి పడిపోయి ఆరేళ్ల కనిష్టానికి చేరుకుంది. డిమాండ్ తగ్గడం, ప్రైవేటు పెట్టబడులు నెమ్మదించడంతో ఈ పరిస్థితి చోటుచేసుకుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ట్యాగ్‌ను ఈ ఏడాదిలో కోల్పోయిన భారత్.. జీడీపీ వృద్ధి రేటులో చైనా(6.2శాతం) కంటే దిగువున ఉంది. గత 27 ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి.