kidnap mistery: చెన్నైలో ఉంటూ లండన్‌లో ఉద్యోగం అంటూ బిల్డప్‌... పెళ్లి వేళ గుట్టు రట్టవుతుందని కిడ్నాప్‌ డ్రామా!

  • శంషాబాద్‌ విమానాశ్రయంలో యువకుడి అదృశ్యం కేసులో కొత్త ట్విస్ట్‌
  • తండ్రి ఫిర్యాదుతో ఉరుకులు పరుగులు పెట్టిన పోలీసులు
  • తీరా వాస్తవం వెల్లడయ్యేసరికి అంతా షాక్ 

రెండేళ్ల నుంచి చెన్నైలోనే ఉంటూ లండన్‌లో ఉద్యోగం చేస్తున్నానని నమ్మిస్తూ వచ్చిన ఓ యువకుడు పెళ్లి సమయంలో గుట్టు రట్టవుతుందన్న భయంతో కిడ్నాప్‌ డ్రామాకు తెరతీశాడు. లండన్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగిన ఓ యువకుడు అర్ధరాత్రి 2 గంటల సమయంలో క్యాబ్‌లో వెళ్తూ అదృశ్యమయ్యాడంటూ రెండు రోజుల క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

 బాధిత యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో అర్ధరాత్రి ఉరుకులు, పరుగులు పెట్టిన పోలీసులు అసలు విషయం బయట పడేసరికి నోరెళ్లబెట్టారు. యువకుని తండ్రి, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి. ఈసీఐఎల్‌ సమీపంలోని దమ్మాయి గూడకి చెందిన ప్రవీణ్‌ రెండేళ్ల క్రితం తనకు లండన్‌లో ఉద్యోగం వచ్చిందని తల్లిదండ్రులను నమ్మించాడు. లండన్‌ వెళ్తున్నానని బయలుదేరి చెన్నై వెళ్లిపోయాడు. రెండేళ్లుగా అక్కడే ఉంటూ లండన్‌లో ఉంటున్నట్లు తల్లిదండ్రులను నమ్మిస్తూ వచ్చాడు.

కొడుకు మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు అతనికి పెళ్లి సంబంధం కుదిర్చారు. నిశ్చితార్థం కూడా జరిగిపోగా మరో పదిహేనులు రోజుల్లో వివాహం జరగాల్సి ఉంది. రెండేళ్లుగా తల్లిదండ్రులను మోసం చేయగలిగినా, పెళ్లి తర్వాత భార్యను విదేశాలకు తీసుకువెళ్లాల్సి ఉంటుందని, ఈ సమయంలో తన గుట్టు రట్టు కావడం ఖాయమని ప్రవీణ్‌ భావించాడు. దీంతో మాస్టర్‌ ప్లాన్‌ వేశాడు.

లండన్‌ నుంచి వస్తున్నానని తల్లిదండ్రులకు తెలిపాడు. నిజమేనని నమ్మిన తల్లిదండ్రులు అతని కోసం ఎదురు చూస్తున్నారు. అర్ధరాత్రి రెండు గంటలకు తండ్రికి ఫోన్‌చేసి తాను విమానాశ్రయంలో దిగి క్యాబ్‌లో వస్తుండగా డ్రైవర్‌ తనను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి చితకబాదాడని, డబ్బు, బంగారు ఆభరణాలు లాక్కెళ్లి తనను అక్కడ వదిలేశాడని తెలిపాడు. కొడుకు ఫోన్‌తో ఆందోళన చెందిన తండ్రి వెంటనే శంషాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు ప్రవీణ్‌ తల్లిదండ్రులను తీసుకుని ఎయిర్‌ పోర్టుకు వెళ్లారు. అక్కడి ఇమ్మిగ్రేషన్‌ అధికారులతో మాట్లాడించడమేకాక, సీసీ కెమెరా పుటేజీని పరిశీలించారు. అన్ని కోణాల్లో పరిశీలించాక ప్రవీణ్‌ బుధవారం అసలు ఎయిర్‌ పోర్టుకే రాలేదని నిర్థారించారు. అతను దేశం విడిచి వెళ్లినట్టుగాని, తిరిగి వచ్చినట్టుగాని ఎటువంటి ఆధారాలు ఇమ్మిగ్రేషన్‌ అధికారుల వద్ద లేకపోవడంతో ఆలోచనలో పడ్డారు.

ఆరా తీస్తే ప్రవీణ్‌ అసలు లండన్‌ వెళ్లలేదని, చెన్నైలో ఉంటున్నాడని, పెళ్లినాడు ఈ విషయం బయటపడుతుందని కిడ్నాప్‌ డ్రామా ఆడాడని తేల్చారు.

  • Loading...

More Telugu News