BJP: రాష్ట్రంలో వ్యక్తులు మారినా మైనింగ్ దోపిడీ ఆగడంలేదు: కన్నా
- ఏపీలో ఇకపై ఒంటరిగానే పోటీచేస్తామన్న రాష్ట్ర బీజేపీ చీఫ్
- దళితులు, ముస్లింలు బీజేపీని అక్కున చేర్చుకుంటున్నారని వ్యాఖ్యలు
- దళితుల్లో మాదిగలు బీజేపీలో ఎక్కువగా చేరుతున్నారని వెల్లడి
రాష్ట్రంలో వ్యక్తులు మారినా మైనింగ్ దోపిడీ మాత్రం ఆగడంలేదని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఏపీలో టీడీపీ అనుసరించిన ధోరణినే వైసీపీ కూడా అనుసరిస్తోందని వ్యాఖ్యానించారు. గతంలో ఇతర పార్టీలతో రెండుసార్లు పొత్తులు పెట్టుకుని నష్టపోయామని, ఇకపై ఒంటరిగానే పోరాడతామని తెలిపారు.బీజేపీని దళితులు, ముస్లింలు అక్కున చేర్చుకుంటున్నారని తెలిపారు. దళితుల్లో ముఖ్యంగా మాదిగలు బీజేపీలో చేరుతున్నారని కన్నా వెల్లడించారు. 2024 నాటికి రాష్ట్రంలో సొంతగా ఎదగాలన్నదే బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు. గతంలో పొత్తులు పెట్టుకుని బీజేపీ నష్టపోయిందని అన్నారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక విపక్ష నేతలపై వేధింపులు పెరిగాయని అభిప్రాయపడ్డారు. 2014లో టీడీపీ సర్కారు ఏర్పాటైనప్పుడు కూడా ఇలాగే చేశారని, ఇప్పుడు వైసీపీ కూడా అలాగే చేస్తే వచ్చే ఎన్నికల్లో ఓటమి తథ్యం అంటూ హెచ్చరించారు. రాజన్న రాజ్యం తెస్తామని చెప్పి పోలీసు రాజ్యం తెచ్చారని కన్నా విమర్శించారు. వైఎస్ శత్రువులను సైతం అక్కున చేర్చుకునేవారని వెల్లడించారు. ఎవరైనా అవినీతికి పాల్పడివుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అవినీతిపరులను వదిలేసి డీలర్లు, కిందిస్థాయి ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం సరికాదని హితవు పలికారు. ఆంధ్రా బ్యాంక్ విలీనంపై నిరసనలను కేంద్రం దృష్టికి తీసుకెళతామని హామీ ఇచ్చారు.