Hyderabad: ప్రియాంకతో కలిసి ఉంటే ఊరుకోనని హేమంత్ ను సతీశ్ హెచ్చరించాడు: డీసీపీ వెంకటేశ్వరరావు
- సతీశ్, హేమంత్ లు చిన్ననాటి స్నేహితులు
- సతీశ్-ప్రియాంక మధ్య సాన్నిహిత్యం ఉండేది
- సాఫ్ట్ వేర్ ఇంజనీర్ హత్య కేను వివరాలు వెల్లడించిన డీసీపీ
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సతీశ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు మీడియాకు వివరించారు. సతీశ్, హేమంత్ లు చిన్ననాటి స్నేహితులు. పదేళ్ల క్రితం సతీశ్ హైదరాబాద్ వచ్చాడు. సాఫ్ట్ వేర్ సొల్యూషన్ లో కోచింగ్ ఇచ్చేవాడు. హేమంత్ విషయానికొస్తే, చిన్న కంపెనీల్లో ఉద్యోగం చేస్తూ మధ్యలోనే మానేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో సతీశ్ ను హేమంత్ కలిసి, తనకు ఓ ఉద్యోగం ఇప్పించాలని కోరాడు. దీంతో, తన కంపెనీలోనే హేమంత్ కు ఉద్యోగం ఇచ్చాడు.
కొన్ని రోజుల తర్వాత సతీశ్, హేమంత్ ల భాగస్వామ్యంలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీని ప్రారంభించారు. గతంలో సాఫ్ట్ వేర్ సొల్యూషన్ లో తన వద్ద కోచింగ్ తీసుకున్న ప్రియాంకను హేమంత్ కు సతీశ్ పరిచయం చేశాడు. కేపీహెచ్బీ కాలనీలోని ఓ హాస్టల్ లో ప్రియాంక ఉండేది. హేమంత్ కు ప్రియాంకను పరిచయం చేయడానికి ముందు నుంచే ఆమె, సతీశ్ సాన్నిహిత్యంగా ఉండేవారు. ఈ విషయం తెలుసుకున్న సతీశ్ భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్ని రోజుల తర్వాత ప్రియాంక, హేమంత్ ల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. వీళ్లిద్దరూ కలిసి ఒక గది అద్దెకు తీసుకుని మూడు నెలల పాటు నివసించారు.
ఈ విషయం తెలుసుకున్న సతీశ్ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. ప్రియాంకతో కలిసి ఉంటే ఊరుకోనని హేమంత్ ను హెచ్చరించాడు. వీళ్లిద్దరి భాగస్వామ్యంలో స్థాపించిన కంపెనీకి నష్టాలు రావడంతో హేమంత్ జీతాన్ని కూడా సతీశ్ తగ్గించేశాడు. ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకున్న హేమంత్, సతీశ్ పై ద్వేషం పెంచుకుని పథకం ప్రకారం హత్య చేశాడని పోలీసులు వివరించారు.